avadani
Statue/God Name:
మొగిలిచర్ల దత్తాత్రేయస్వామి
Description:

కేవలం 32 సంవత్సరాలు జీవించి, ఎక్కువ కాలం తపస్సులోనే గడిపి, కపాలమోక్షం ద్వారా దేహాన్ని చాలించిన అవధూత మొగిలిచర్ల శ్రీదత్తాత్రేయ స్వామి. సమాధి నుంచే భక్తుల మనోరథాలను నెరవేరుస్తాననీ, జ్ఞానబోధ చేస్తానని ఆయన ప్రకటించారు. ఏటా ఆయన భక్తులు మాలధారణతో మండల దీక్ష చేసి, స్వామి పట్ల తమ ప్రపత్తిని చాటుకుంటారు.

అది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మొగిలిచర్ల గ్రామ శివారు ఫకీరుమాన్యం... మొగిలిచర్ల ఒక పల్లెటూరు. సుమారు 46 సంవత్సరాల కిందట ఒక యోగి ఇక్కడ ఆశ్రమ నిర్మాణం మొదలుపెట్టేదాకా ఈ ఊరి గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది బహు తక్కువ. ఆరు అడుగులకు పైగా పొడుగు, తెల్లని మేని ఛాయ, నెత్తిన ముడివేసుకున్న జటాఝూటం లాంటి జుట్టు, చిరునవ్వు మోముతో ఉన్న 26, 27 ఏళ్ల వయసున్న దిగంబర యువకుడు ఆ ఊరిలో అడుగుపెట్టారు. 

ఫకీరుమాన్యం వద్ద ఆశ్రమ నిర్మాణానికి ముందు కొద్దిరోజుల పాటు ఆయన తన భక్తులైన పవని శ్రీధరరావు, నిర్మల ప్రభావతి దంపతుల ఇంటిలో ఉన్నారు. ఆయన తపస్సు ఎంత తీవ్రమైనదంటే, దాని శక్తికి పశుపక్ష్యాదులు కూడా ప్రభావితమయ్యేవి. దత్తాత్రేయస్వామి ఆ ఇంటిలో ఉన్నప్పుడు రోజుల తరబడి సమాధి స్థితిలోకి వెళ్లిపోయేవారు. ఆయనకు కేటాయించిన గది తలుపులు మూసివేసుకొని ధ్యానంలో మునిగిపోయేవారు.

చిత్రంగా ఆ రోజులలో ఆ ఇంటి మీద వందలాది రామచిలుకలు వచ్చి వాలుతుండేవి. అదే సమయంలో ఇంటి చుట్టూ ఒక పెద్ద సర్పం తిరుగుతుండేది. అత్యంత దివ్య సుగంధ పరిమళం ఆ పరిసరాల్లో వ్యాపించేది. రాత్రిపూట ఒకరకమైన నీలి రంగు కాంతి వలయం ఏర్పడేది. ఈ సంఘటనలన్నిటికీ మొగిలిచర్ల గ్రామస్తులు ప్రత్యక్ష సాక్షులు.

1976 సంవత్సరం మే 6వతేదీ రాత్రి. ఆ రోజు వైశాఖ మాసం శుద్ధ సప్తమి. సమయం రాత్రి 11 గంటలు అవుతోంది. శీదత్తాత్రేయ స్వామి ఆశ్రమం భక్తులతో కిక్కిరిసి ఉంది. ఇంతలో ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. స్వామివారి శరీరంలోంచి ఒక పెద్ద శబ్దం వినబడసాగింది. ఆ ధ్వని దూరం నుంచి ఒక మోటార్ సైకిల్ వస్తున్న శబ్దంలా ఉంది. రెండు నిమిషాల కాలం గడిచేసరికి ఆ శబ్దనాదం ఉద్ధృతంగా మారింది. అందరూ స్వామివారి వైపు చూశారు. ఆయన నాభి ప్రాంతం నుంచి మొదలైన ఆ శబ్దం క్రమంగా ఊర్ధ్వంగా శిరస్సుపై భాగానికి పాకిపోయింది. ఇలా దాదాపు ఐదు నిమిషాల పాటు జరిగింది. అందరూ ఆశ్చర్యంగా స్థాణువుల్లా నిలబడిపోయారు.

ఆ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ మరునిమిషంలోనే స్వామివారి శిరస్సుపై మధ్యభాగం నుంచి రక్తం ధారగా కారింది. అదే సమయానికి ఆశ్రమం బయట ఉన్న వ్యక్తులకు ఆశ్రమం పై భాగం నుంచి ఒక నీలి రంగు జ్యోతి పైకెగసి ఆకాశంలో కలిసిపోవడం కనిపించింది. ఆ జ్యోతిని మొగిలిచర్ల గ్రామంలో ఉన్న వ్యక్తులూ చూశారు. 

స్వామివారు కపాలమోక్షం పొందారని ఆశ్రమం లోపల ఉన్న భక్తులకు అర్థమైంది. అప్పటి దాకా స్వామివారు తమ ప్రాణాన్ని శరీరంలోని నిలిపి ఉంచారని వారు గ్రహించారు. 1950 ఏప్రిల్ 14న అరుణాచలంలో శ్రీరమణమహర్షి శివైక్యం చెందినప్పుడు సరిగ్గా ఇదే జరిగింది. వారి దేహం నుంచి ఒక మహాజ్యోతి అరుణాచల పర్వతంలోకి ప్రవేశించడాన్ని ఎందరెందరో తిలకించారు. ఆ తర్వాత మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామి జీవితంలో అలాంటి మహత్తర ఘటన ఆవిష్కృతమైంది. 32 ఏళ్ల వయసులోనే కపాలమోక్షం ద్వారా సిద్ధి పొందిన ఆయన మొగిలిచర్ల దత్తాత్రేయస్వామిగా ప్రసిద్ధి పొందారు.

సమాధి నుంచే భక్తులకు అభయం :

సత్ప్రవర్తన, నైతిక జీవన ప్రాధాన్యం, క్రమశిక్షణతో కూడిన ఆధ్యాత్మిక విలువల ఆచరణ, మానవత్వ విలువల గురించే బోధిస్తూ వారిలో పరివర్తన తెచ్చేవారు. ప్రజల్లో గూడుకట్టుకున్న మూఢవిశ్వాసాలను తొలగించేవారు. ఆయనకు ఇతోధికంగా సేవలందించినవారిలో శ్రీధరరావు దంపతులు, మీరాశెట్టి దంపతులు, చెక్కా కేశవులు ముఖ్యులు. తన తపస్సు ఫలించిందనీ, దేహాన్ని త్యజించాలని నిర్ణయించుకున్నాననీ శ్రీదత్తాత్రేయస్వామి వారికి వెల్లడించినప్పుడు... లోకానికి మంచిని బోధించేందుకు మరి కొంతకాలం తమ మధ్య ఉండాలని వారు కోరారు. అయితే, తనను ఆశ్రయించిన భక్తుల మనోరథాలను నెరవేర్చేందుకు, వారికి తగిన బోధ చేసేందుకు, వారిలో పరివర్తన తెచ్చేందుకు శరీరంతో ఉండాల్సిన పనిలేదని, తన సమాధి నుంచే ఆ పని జరుగుతుందని స్వామి చెప్పారు. ఆ ప్రకారమే ఎందరినో అనుగ్రహించినట్లు మొగిలిచర్లకు వచ్చే భక్తులు తమ అనుభవాలను చెబుతూ ఉంటారు.

మొగిలిచర్లకు ఎలా వెళ్ళాలి?

 

మొగిలిచర్లకు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌ సింగరాయకొండ. అక్కడి నుంచి కందుకూరు మీదుగా రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. దూరం 60 కి.మీ. బస్సులో నేరుగా కందుకూరు వెళ్ళి అక్కడి నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొగిలిచర్లకు వెళ్ళవచ్చు. ఒంగోలు నుంచి 90 కిలోమీటర్ల దూరంలో (కందుకూరు మీదుగా) ఈ క్షేత్రం ఉంది. వసతి సదుపాయం, పల్లకీసేవ తదితర పూజా కార్యక్రమాల వివరాల కోసం 94402 66380, 9441916557 నెంబర్లలో సంప్రతించవచ్చు. ప్రతి శనివారం సమాధి మందిరం తలుపులు మూసి ఉంటాయి.