మంగళవారం పారాయణ ప్రారంభం

అధ్యాయం  - 39

శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః

సిద్ధ యోగి ఇంకా ఇలా చెప్పారు, “గంధర్వపురంలో సోమనాథుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనిది ఆపస్తంబశాఖ, శౌనక  గోత్రం. అతని భార్యకు 60 ఏళ్లు నిండిన సంతతి కలుగ లేదు. ఆమె నిత్యం శ్రీగురుని దర్శించి , వారి పాదాలను పూజించి నమస్కరిస్తూ ఉండేది. ఇలా కొన్ని సంవత్సరాలు తదేకదీక్షతో చేస్తుండేది. ఒక నాడు ఆ మహా ఇల్లాలితో,' అమ్మ! ఇన్నాళ్లుగా మమ్మల్ని సేవిస్తునావు , నీ అభీష్టమేమిటో ఎన్నడూ చెప్పలేదే? ఇప్పటికైనా చెబితే గౌరీ నాధుని కృపవలన తీరుస్తాను అన్నారు. ఆమె ఎంతో సంతోషించి దోసిలి ఒగ్గి కన్నీరు కారుస్తూస్వామి! కొడుకులు లేని వారికి ఉత్తమగతులు ఉండవు కదా! నా చంక బిడ్డను ఎత్తుకునే అదృష్టానికి నేను నోచుకోలేదు. అలాగే నాకు 60 ఏళ్లు నిండిపోయాయి, మాకు, పితృదేవతలకు తిలోదకాలు ఇచ్చేవాడు లేకుంటే మాకు పున్నామ నరకం తప్పదేమో? స్వామి! అయ్యిందేదో అయ్యింది రు జన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి చాలు అని ఆయన పాదాలకు నమస్కరించింది. శ్రీ గురుడు నవ్వుతూ, “ఓసి పిచ్చి తల్లి, ఏమి కోరిక కోరావమ్మా? ఎప్పుడో రాబోయే జన్మ సంగతి ఇప్పుడెందుకు? అప్పుడు బిడ్డలు కలిగిన వాళ్ళు నేను ఇచ్చిన వరం వలన కలిగినట్లు నీకు ఎలా తెలుస్తుంది. నీవు నిత్యం ఇంత శ్రద్ధగా సేవిస్తున్నారు కనుక నీవు కోరినది జన్మలోనే ప్రసాదిస్తాము. కొద్దికాలంలోనే నీకు ఒక కూతురు ,కొడుకు కలుగుతారు అని వరం ఇచ్చారు.

అప్పుడు గంగాబ తన కొంగున ముడి వేసుకుని స్వామికి నమస్కరించి, “స్వామి! ఒక సందేహం, నాపై కోపగించుకోవద్దు. నేను బిడ్డలకోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను, పుణ్యతీర్థాల్లో స్నానం చేశాను, రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పగా నమ్మి, కనిపించిన రావిచెట్టుకు ప్రదక్షిణలు, నమస్కారాలు చేసి అలిసిపోయాను అలాగే నా వయస్సు అంతా చెల్లిపోయింది. నేను వచ్చే జన్మలోనైనా బిడ్డలు కలగాలని కోరుకుంటే జన్మలోనే ప్రసాదించారు అయితే ఇప్పుడు వరకు నేను రావిచెట్టుకు ప్రదక్షిణం చేయడం వల్ల ప్రయోజనం ఏమున్నది ? అనగానేఅమ్మాయి! నీవు చేసిన అశ్వద్ద పూజ వలన నీకు ఎంతో పుణ్యం లభించింది, ఇప్పుడు అవివేకంతో కాస్త పుణ్యం పోగొట్టుకోకుఇకనుండి సంగమంలో  ఉన్న రావిచెట్టుకు, మాకు కలిపి నిత్యం ప్రదక్షిణ, పూజ చేస్తుండు. మేము ఎప్పుడూ అశ్వత్థ వృక్షం లో ఉంటాము, అందుకే పురాణాలన్నీ దానినిఅశ్వద్ధ నారాయణుడని”  కీర్తించాయి.

అశ్వత్థ వృక్షం లో సర్వ దేవతలు ఉంటారు, వృక్షం యొక్క మూలమే బ్రహ్మ , దాని మధ్య భాగమే   విష్ణువు, దాని చివరి భాగమే శివుడు. కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే. అశ్వత్థ ప్రదక్షిణం, చైత్ర, ఆషాడ, పుణ్య మాసాల లోనూ, గురు, శుక్ర మౌఢ్యాలలోను, కృష్ణ పక్షంలోనూ ప్రారంభించకూడదు. ఆది, సోమ, శుక్ర వారాలలోనూసంక్రమణ సమయాలు మొదలైన నిషిద్ధ సమయాలలోనూ, రాత్రి భోజనం అయ్యాక వృక్షాన్ని సేవించకూడదు. ప్రవహిస్తున్న నీటిలో గుడ్డల తోనే స్నానం చేసి ఉతికిన గుడ్డలను ధరించి గణపతిని పూజించి , అప్పుడు సంకల్పం చెప్పి అశ్వద్ద వృక్షానికి భక్తితో ఏడు సార్లు అభిషేకం చేయాలి. మరలా స్నానం చేసి పీతాంబరం ధరించిన  నారాయణుని  8 బాహువులు గల వానిగా ధ్యానించి , తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ గాని, మౌనంగా గానీ, ఎంతో నెమ్మదిగా ప్రదక్షణాలు చేయాలి. ఇది ప్రదక్షిణానికి మొదట, చివర నమస్కారం చేయాలి. ఇలా రెండు లక్షల ప్రదక్షణాలు చేస్తే సర్వ పాపాలు నశించి, నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి.

అమ్మ! “అశ్వర్థ మహత్యం తెలిసింది కనుక నీవు ఎట్టి  సంశయము పెట్టుకోకుండా అలా చేయి, మీ అభీష్టం నెరవేరుతుంది అన్నారు. ఆమె నాటి నుండి మూడు రోజులు ఉపవసించి, మూడు పూటలు షాట్కుల తీర్థంలో స్నానం చేసి, గురువు చెప్పినట్లు అశ్వర్ధని సేవించి, దానికి ఏడు బిందెలు నీళ్లు పోసి , శ్రీ గురు సహితంగా దానిని పూజించింది. మూడు రోజులు దంపతులు సంగమంలోనే ఉన్నారు. మూడవనాటి రాత్రి ఆమెకు స్వప్నంలో మీ కోరిక తీరింది, ఉదయం శ్రీ గురుని పూజించి ఆయన ఇచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను”, అన్నారు. ఆమె ప్రదక్షిణం చేసి నమస్కరించగానే రెండు పండ్లు ఇచ్చి, పారాయణ అయ్యాక నీవి పండ్లు తిను అన్నారు. నల్లని వెంట్రుక ఒకటైన లేకుండా జుట్టు మెరిసి, పళ్ళు అన్ని ఊడిపోయిన తరువాత కూడా ఆమె గర్భవతి అయిందని ఆశ్చర్యంతో అందరూ ముక్కున వేలు వేసుకున్నారు. మరొక్కసారి శ్రీ గురుని మహిమ అందరికీ అర్థమైంది. ఒక శుభముహూర్తంలో ఆమెకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమెకు శ్రీగురుని పేరిటసరస్వతిఅని పేరు పెట్టుకున్నారు. దంపతులు  శ్రీ గురుని దర్శించి , బిడ్డను ఆయన ముందుంచగా, స్వామి వాత్సల్యంతోపుత్రవతి! లేవమ్మా! ఇది ఆడపిల్లే కానీ మగ పిల్లవాడు కాదే? ” అంటూ నవ్వి, నీకు కొడుకు కూడా పుడతాడు. కానీ నీకు వంద సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా? లేక 30 సంవత్సరాల వయస్సు గల విద్వాంసుడు కావాలా ? అన్నారు. అప్పుడు గంగాంబ “విద్యావంతుడు, సుగుణాల సంపన్నుడు అయినా కొడుకునే ప్రసాదించండి. అతనికి అయిదుగురు పిల్లలు కలిగేలా దీవించండి' అని స్వామికి నమస్కరించింది. “తధాస్తుఅని ఆమెను దీవించగా ఒక సంవత్సరంలో ఆమెకు కొడుకు పుట్టాడు. అతనికి కూడానృసింహఅని శ్రీ గురుని పేరే పెట్టారు. అతని చేత యజ్ఞాలు చేయించుకోవడానికి కాశీ నుండి శ్రీమంతులు, పండితులు వచ్చి అతనిని తీసుకు వెళుతూ ఉండేవారు. శ్రీ గురు కృప ఎంతటిదో చూసావా! నామధారకా ! వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది.

అధ్యాయం  - 40

శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః

సిద్ధ యోగి గురు లీలలు ఇంకా ఇలా వివరించారు. “గంధర్వ పురానికి ఒక నాడు నరహరిశర్మ అనే కుష్ఠురోగి వచ్చాడు. అతనిది యజుస్మాక , గార్గేయ గోత్రం. అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకుని మనవి చేసుకున్నాడు . “స్వామి! మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని, భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమిమీద అవతరించాడు అని విని, మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను. నాకు కుష్టు వ్యాధి రావటం వలన ఎవరు నా ముఖం కూడా చూడకుండా తిట్టుకుంటున్నారు. నేను వేదం అభ్యసించినప్పటికి కూడా ఎవరూ నన్ను భోజనానికి కూడా పిలవడం లేదు. ఎన్నో జన్మలలో చేసిన పాపాలన్నీ పేరుకుని, నన్ను ఇప్పుడు ఇలా కట్టి కుడుపుతున్నాయి. తెల్ల కుష్టురోగం తొలగించుకోవడానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను, ఎన్నో తీర్ధాలను సేవించాను. దేవతలకు మ్రొక్కానుకానీ కించిత్తయినా తగ్గలేదు, చివరికి మీరే దిక్కు అని వచ్చాను. మీకు కూడా నాపై దయ కలగకుంటే నా ప్రాణాలు ఇక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను, స్వామి! నన్ను ఉద్ధరించండి అని నమస్కారం చేశాడు. శ్రీ గురుడు అతనిని కరుణించి లెమ్మని చెప్పి , “విప్రుడా! ఇదివరకు ఎన్నో పాపాలు చేసావు కనుకనే నీకి కుష్టు వ్యాధి వచ్చింది. ఇది  తొలగిపోవడానికి నేనొక ఉపాయం చెబుతాను, దానివల్ల దివ్యమైన శరీరం పొందుతావు.

ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండు కట్టెపుల్లలు తీసుకుని అటుగా వెళ్తుండగా వాటిలో ఒక మేడి చెట్టు కర్రను ఇచ్చి, నీవు దీనిని తీసుకుని పోయి మా మాట యందు దృఢ విశ్వాసం ఉంచి మేము చెప్పినట్లు చేయి, దానిని సంగమంలోని సంగమేశ్వర ఆలయం వద్ద భీమా నది ఒడ్డున భూమిలో నాటి నిత్యం స్నానం చేసి రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి  రెండు చేతులలో రెండు కుండల నిండుగా నీరు తెచ్చి మూడు పూటలా ఎండుకట్టెకు పోస్తూ ఉండు. అది ఎప్పుడు చిగురిస్తుందో అప్పుడే నీ పాపం పోయి మీ శరీరం స్వచ్ఛవుతుంది వెళ్ళు! అన్నారు. నరహరి  మాట పై సంపూర్ణ విశ్వాసం ఉంచి కట్టెను భక్తితో నెత్తిపై మోసుకుపోయి ప్రతినిత్యం శ్రీ గురుడు చెప్పినట్లు చేస్తున్నాడు. కట్టెకు నీరు పోయడం చూసినవారంతా నవ్వి, ఓరి వెర్రి బ్రాహ్మణుడా! నీకేమైనా మతి పోయిందా? నీవు ఎన్ని రోజులు నీళ్ళు పోస్తే మాత్రం ఎందుకంటే చిగురిస్తుందా? నిజానికి జన్మలో నీ రోగం కుదిరే యోగ్యత లేదని సూచించడానికి శ్రీ గురుడు నీకు ఇలా చెప్పారు. జబ్బుకు తోడు ప్రయాస ఎందుకనగా శ్రీ గురుడు చెప్పినట్లు భక్తితో చేయడం నా బాధ్యత, వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వారి పనిఅని చెప్పి నిష్టగా చేస్తుండడం చూసి వారు శ్రీగురుని తో వృధా ప్రయాస ఎందుకు అనిన నా వినటం లేదు , స్వామి! అతనికి మీరైనా చెప్పండి లేకపోతే అలాగే చేస్తుంటాడుఅని చెప్పారు. శ్రీ గురుడు  భూలోకంలో గురు వాక్యం ఒక్కటే  తరింప చేయగలదు. దానిని విశ్వసించ గలవారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి. ఎవరి భావం ఎలా ఉంటే ఫలితం కూడా అలానే సిద్ధిస్తుంది, దానిని తెలిపే వృత్తాతం ఉన్నది విను.

పూర్వం పాంచాల దేశాన్ని సింహ కేతువు పరిపాలిస్తుండేవాడు. అతని కొడుకు ధనుంజయుడు, ఒకసారి వేటకని మహా అరణ్యానికి  వెళ్ళాడు, చాలాసేపు వేటాడి బాగా అలసిపోవడం వల్ల దాహం వేసింది.. అప్పుడు ఒక బోయవాడు ఒక కొలను వద్దకు తీసుకు పోగా అతని దాహం తీర్చుకుని  ప్రక్కనే ఉన్న దేవాలయం లో విశ్రాంతి తీసుకున్నాడు. బోయవాడు ప్రక్కనే ఉన్న ఒక శివలింగాన్ని తీసుకుని తదేకంగా చూస్తూ ఉండిపోవడం చూసిన రాజకుమారుడునీకు లింగం ఎందుకు అని అడిగాడు?” అయ్యా! చాలా కాలంగా నాకు శివ పూజ చేసుకోవాలనే కోరిక ఉంది, ఇది చాలా ప్రశస్తమైనది అని విన్నాను, నేను అడవిలో పెరిగిన వాడిని కనుక దీనిని ఎలా పూజించాలో నాకు తెలియదు, దయతో పూజా విధానం చెప్పండి అని కోరాడు, అయితే చెబుతాను శ్రద్ధగావిను దీనిని తీసుకుపోయి, ఒక చోట శుభ్రం చేసి స్థాపించు , దీని రూపంలో సాక్షాత్తు శివుడే మీ ఇంట్లో ఉంటాడు. నిత్యం పూజ చేసి ప్రతిరోజూ స్మశానం నుండి చితాభస్మం తెచ్చి శివునికి అర్పించుఅని చెప్పారు.

బోయవాడు ఇంటికి వెళ్లి ప్రకారమే చేశాడు. ఒక రోజు ఎంత వెతికినా చితాభస్మం దొరకలేదని బాధపడుతుంటే, అతని భార్య నాదా! దానికోసం అంత బాధపడతావ్ ఏమీ? మన ఇంట్లో ఎన్నో కట్టెలు ఉన్నాయి కనుక వాటితో నన్ను దహనం చేసి స్వామికి అర్పించు అన్నది. భయపడొద్దు, నీ వ్రతం బంగం కాకూడదు. శివ పూజ కోసం శరీరమే అర్పించడంకంటే సంతోషం ఏమున్నది, శరీరం ఏనాటికి అయినా చచ్చి బూడిద కావలసినదే కదా! అలాంటి శివ పూజకర్పించడంకంటే కావలసినది ఏమున్నదిఅని ధైర్యం చెప్పింది.

అప్పుడు ఆమె పట్టుబట్టి బోయ వాడిని ఒప్పించి, ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుని ఇంటికి నిప్పు పెట్టమనది. అతడలాగే సర్వం భస్మమయ్యాక దానిని భక్తితో లింగానికి అర్పించి ఎంతో సంతోషించాడు. తరువాత ఏకాగ్రమైన మనసుతో హృదయపూర్వకంగా  , శివునికి నమస్కరించి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకురమ్మని తన భార్యని పిలిచాడు, అది ఏమి చిత్రమో కానీ శివుని అనుగ్రహం వల్ల బతికి వచ్చింది. వెనుకకు తిరిగి చూస్తే  ఇల్లు కూడా చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నదిఅతని భార్య నాలుగు ప్రక్కల మంట అంటుకుని మండుతున్న గాని నాకు బాగా నిద్ర వచ్చి పడుకోగానే నిద్రపట్టింది, ఏం జరిగిందో తెలియదు మీరు పిలవగానే మేలుకో వచ్చి లేచి వచ్చాను, ఆహా! ఏమి మన భాగ్యం శివుని లీలా అని స్మరించగానే ఈశ్వరుడు సాక్షాత్కరించి వరమిచ్చాడు. దేనియందు అయినా విశ్వాసం ఉండాలేగానీ, ఎంతటి ఫలితం అయినా లభించగలదు, కనుక ఆ కుష్ఠిరోగిఆయిన నరహరి చేస్తున్న సేవకు ఫలితంవుండకపోదు. ఎవరి భావానికి తగిన ఫలితం వారికి లభిస్తుంది అన్నారు.

కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్లి అక్కడ తమ అనుష్టానం  పూర్తిచేసుకుని కుష్ఠురోగి వద్దకు వెళ్లారు. నరహరి ఎంతో భక్తిశ్రద్ధలతో చేస్తుండడం చూసి ఆనందించి ఆయన కమండలంలోని నీరు తీసి, ఎండిన మేడి కర్ర మీద చల్లారు. మరుక్షణమే అది చిగురించింది! సంగమానికి వచ్చిన వారంతా చూస్తుండగానే పెరిగి చిన్న మేడి చెట్టు అయింది. అది చూస్తున్న నరహరికి కూడా కుష్టురోగం అదృశ్యమై అతడి శరీరం బంగారు ఛాయతో మెరిసిపోతుంది. అతడు ఆనందభాష్పాలు రాలుస్తూ శ్రీ గురుని స్తుతించాడు. గ్రామంలోని వారందరూ ఆ లీ గురించి విని, శ్రీ గురుణ్ణి దర్శించి భక్తితో ఆయనకు హారతులిచ్చారు. తర్వాత శ్రీ గురుడు అతనినీ దగ్గరకు పిలిచినాయనా! నీ పట్ల మాకు ఎంతో ప్రీతి కలిగింది అని, విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి, నీకు "యోగీశ్వరుడు" అని పేరు పెడుతున్నా ము. నీ భార్యా బిడ్డలను తీసుకువచ్చి మా సన్నిధిలోనే ఉండు అన్నారు.

అతడు భక్తితో చేసిన స్తోత్ర మంటే శ్రీ గురుణ్ణికి ఎంతో ప్రీతి, స్తోత్రంలో ఏమైనా వ్యాకరణచందు దోషాలు ఉన్నాయి అని తప్పులు దిద్ద బోతే, శ్రీ గురుడు అంగీకరించక స్తోత్రం అలానే చదవాలనే వారు.

దిగంబరా దిగంబరా  శ్రీపాదవల్లభా దిగంబరా!! 

అధ్యాయం  - 41

శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః

నామదారకుడు, మా పూర్వీకులు శ్రీ  గురు భక్తులు ఎలా అయ్యారో ? తెలుపమనిగా సిద్ధయోగి ఇలా చెప్పారు. నాయనా! పూర్వం శ్రీ గురుడు  తీర్దానం చేస్తూ వాస క్షేత్రానికి వచ్చినప్పుడు ఆయనను భక్తితో పూజించి, ఆయన ప్రేమకు పాత్రుడైన సాయం దేవుడే మీ పూర్వీకులు. శ్రీ గురుడు అనేక తీర్థ క్షేత్రాలను పావనం చేసి  గంధర్వ పురం చేరారు కదా! అది తెలిసిన సాయం దేవుడు భక్తిశ్రద్ధలతో అడుగడుగుకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నాడు. శ్రీ గురుని దర్శించుకోగానే అతనికి రోమాంచితమై, ఆనందభాష్పాలతో సాష్టాంగ నమస్కారం చేసి గద్గదస్వరంతో స్తుతించాడు.

శ్రీ గురుడు సంతోషించి సాయం దేవుడు తలపై చేయి పెట్టి, నాయనా! నీవు నాకు పరమ భక్తుడవు, నీ వంశీయులు అందరూ మా భక్తులై చిరకాలం వర్ధిల్లు గాక అని ఆశీర్వదించారు. తర్వాత శిష్యులు అందరితో ఆయన, “మీరంతా సంగమంలో స్నానం చేసి అశ్వద్ద వృక్షాన్ని సేవించి భోజనానికి రమ్మని చెప్పారు. అప్పుడు స్వామి సాయం దేవుడిని ప్రక్కనే కూర్చుండబెట్టి భోజనం పెట్టించారు. తరువాతనాయనా! నీవు ఎక్కడ ఉంటున్నావు? నీ భార్య బిడ్డలు క్షేమమా? చాలాకాలానికి కనిపించావు”, అన్నారుఅపుడు సాయం దేవుడు స్వామి! మీరు సర్వజ్ఞులు మీకు తెలియనిది ఏమున్నది? మీ దయవల్ల అందరూ క్షేమమే . నా భార్య బిడ్డలు ఉత్తరకంచి లో ఉన్నారు, నా కుటుంబ భారాన్ని కొడుకులు చూసుకుంటున్నారు కనుక నేను మీ పాద సేవ  చేయాలనుకుంటున్నాను అనుగ్రహించమని కోరాడు. శ్రీ గురుడు నవ్వి, “నాయనా! మమ్మల్ని సేవించడం అంత సులభం కాదు, ఒక చోట ఉండే వారము కాదు, ఎక్కడపడితే అక్కడ ఉంటాము, మాతో కలిసి ఉండడం, మా సేవ చేయడము కష్టం. కనుక బాగా ఆలోచించుకో అన్నారు.

సాయం దేవుడు,” స్వామి! మిమ్ము  శరణు పొందిన నన్ను దూరం చేయవద్దు, మీరు ఉండగా నాకు భయం ఏమిటి? మీ పాద సేవ చేసుకుంటాను అనుజ్ఞ ఇవ్వండిఅని ప్రార్థించారు. అప్పుడు శ్రీ గురుడునీకంత దృఢ భావం ఉంటే అలానే చెయ్యిఅని అంగీకరించారు. అతడు స్వామి సన్నిధిలో మూడు నెలల తర్వాత ఒకనాటి సాయంత్రం శ్రీ గురుడు శిష్యుల ఎవరిని రావద్దు అని చెప్పి, సాయం దేవుని ఒక్కడినే సంగమానికి తీసుకువెళ్లారు. శ్రీ గురుడు అశ్వత్థ వృక్షం కింద కూర్చుని, కొంతసేపు శిష్యులతో మాట్లాడారు. వారు వెళ్లిపోయాక శ్రీ గురుడు, సాయం దేవుడు మాత్రమేక్కడ ఉన్నారు.

అప్పుడు అతనిని పరీక్షించదలచి, శ్రీ గురుడు ఒక లీల చేశారు. అంతలోనే అకస్మాత్తుగా పెనుగాలి చెలరేగింది, గాలికి చెట్లు ఊగిపోయి విరిగి పడుతున్నాయి, ఉన్నట్టుండి భయంకరమైన ఉరుములు, కన్నులు మిరుమిట్లు గొలిపే లా కుండపోతగా వర్షం ఆరంభమైనది. సాయం దేవుడు గాలికి ఎలాగో ఓర్చుకుని, తన ఒంటిపై ఉన్న ఉత్తరీయం తీసి శ్రీ గురునికి కప్పి అడ్డు నిలిచాడు. అప్పుడు శ్రీ గురుడు నాయనా! నన్ను చలి బాధిస్తున్నది, నీవు మఠానికి పోయి అగ్ని తీసుకుని రా! అన్నారు. అతడు బయలుదేరుతుంటే అతనిని బాటకు అటూఇటూ చూడకుండా వెళ్లి రమ్మని చెప్పారు.

వెంటనే సాయం దేవుడు బయలుదేరి  గంధర్వపురం వైపు నడవసాగాడు, దారిలో ఎక్కడ చూసినా మోకాలు లోతు బురదలో కాళ్లు కూరుకుపోతున్నాయి. ఆపైన నీరు రొమ్ము లోతున ప్రవహిస్తోంది. చివరకు ఎలాగో అతడు మఠం చేరి అక్కడ సేవకులను నిద్ర లేపి కుండలో నిప్పులు తీసుకుని తిరిగి బయలుదేరాడు. శ్రీ గురుడు తనను పక్కలకు చూడకుండా ఎందుకు సాగిపోమన్నారో  తెలుసుకోవాలన్న కుతూహలం తీవ్రమై నెమ్మదిగా కుడి పక్కకు చూశాడు, అటు ప్రక్కన ఐదు పడగల భయంకరమైన తాచు పాము కనిపించింది. భయంతో వేగంగా నడుస్తూ ఎడమ పక్కకు చూడగా అటు కూడా మరొక భయంకరమైన పాము అతను వెంటనే వస్తోంది. అతడు భయంతో మతిపోయి, బాట లోని ఎత్తు ,ఫలాలు పట్టించుకోకుండా పరిగెత్తగా పాములు కూడా వెంబడించాయి.

అప్పుడు సాయం దేవుడు దిక్కుతోచక శ్రీ గురుని స్మరించగా కొంచెం భయం తగ్గి, ఒక చక్కని బాట చిక్కింది, కొద్దిసేపట్లోనే సంగమం వద్ద ఉన్న రావి చెట్టు అతనికి కనిపించింది, ప్రాంతమంతా వేల కొద్దీ దీపాలతో వెలిగిపోతున్నట్లు కనిపించింది. అక్కడ నుండి వేదఘోష అతనికి చక్కగా వినిపిస్తోంది. అతడు అటువైపుగా వెళ్లి మీ శ్రీగురుని  సమీపించే సరికి, ఆయన ఒక్కరే ఉన్నారు. అతడికి భయం వలన వర్షం ఆగిందని కూడా తెలియలేదు, ఆకాశంలో పిండి ఆరబోసినట్లు, పండు వెన్నెల వచ్చింది. అతడు పాత్ర కిందపెట్టి, నిప్పులు ప్రజ్వలింపచేశాడు . భయం తగ్గి గురువు కేసి చూసేసరికి రెండు పాములు ఆయనకు నమస్కరిస్తున్నా యి. వాటిని చూడగానే సాయం దేవుడుకి మళ్లీ భయమేసింది. శ్రీ గురుడు అప్పుడు నవ్వి, “భయపడవద్దు, నిన్ను రక్షించడానికి పాములను మేమే పంపాము, గురు సేవ ఎంత కఠినమైనదో తెలిసిందా? తగిన భక్తిశ్రద్ధలు ఉంటేనే అందుకు పూనుకోవాలి అన్నారు. “స్వామి! నేనేమీ తెలియని వాడిని కృపతో గురు భక్తి ఎలాంటిదో వివరించండి, దాని సహాయంతో  స్థైర్యం  చిక్కించుకుని మీ చెంతనే ఉండి సేవిస్తాను " అన్నాడు.

నాయనా! చెబుతాను విను, నీవు ఇక రాత్రి అయిందో,  బ్రాహ్మ ముహూర్తం అయిందోనని పట్టించుకోకుండా వినాలి. పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురు భక్తితత్వం, శివుడు ఇలా చెప్పారు. “దేవి, గురువే ఈశ్వరుడు అన్న దృఢమైన విశ్వాసంతో సేవించడం వల్ల  సర్వసిద్ధులు కలుగుతాయి. యధావిధిగా గురుని సేవించే వారికి యజ్ఞాది కర్మలు చేయుటలో లోటు కలుగదు. పూర్వం త్వష్ట  అనే బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసి, వేదాధ్యయనానికి గురువు వద్దకు పంపారు. బ్రహ్మచారి చక్కగా గురుసేవ చేస్తున్నాడు. ఒకసారి గురువు కుటీరం శిధిలమై వర్షం నీరు లోపలకు కురిసింది, గురువు త్వష్టనీ పిలిచి, “నాయనా! కుటీరం ప్రతిసారి వర్షానికి పాడైపోతుంది, ఇలా గాలి, వాన, అగ్నుల వలన నశించని కుటీరం నాకు కావాలిఅని చెప్పారు. అప్పుడు గురుపత్నినాయనా!, ఎవ్వరూ నేయనిది, కుట్ట నిది, రంగురంగుల ది, సరిపోయేది అయినా రవిక నాకు కావాలిఅన్నది. ఇంతలో గురు పుత్రుడు  వచ్చిఅన్నా, నాకు మట్టి అంటనివి , నీటిమీద నడిపించగలవీ, ఎప్పుడూ సరిపోయేవి అయినా పాదరక్షకులు కావాలిఅని చెప్పాడు. ఇంతలో చిన్న పాప అయినా గురుపుత్రిక కూడా వచ్చి, “ అన్నా! నా చెవులకు కుండలాలు, ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి, అది ఒంటిస్తంభం కలిగి, దంతంతో చేసినధై , పగలనిదిగా , తీసుకువెళ్లడానికి వీలుగా నెట్టుకు వెళ్లడానికి చక్రాలు, మళ్లీ ముడిచి వేయడానికి వీలున్నది, అయ్యి అందులో పీట, కుర్చీ ఉండాలి. ఆడుకోవడానికి వంట పాత్రలు మట్టివి కావాలి నాకు అవే వంట నేర్పాలి ". అంతేకాకుండా ఇతర వంట పరికరములు కూడా కావాలిఅని చెప్పింది.

త్వష్ట  అంగీకరించి, అడవికి వెళ్తూ అవన్నీ ఎలా సంపాదించాలి అని ఆలోచించాడు. చివరకు దిక్కుతోచక తన గురువుని ధ్యానించి తన మనసులోనే  ఆయనను శరణు పొందాడు. అలా  పోతుండగా అవధూత కనిపించి, “నాయనా! , నీవు ఎవరు ? ఇంత చిన్న వాడవు? ఘోరమైన అరణ్యములో చింతాక్రాంతుడై తిరుగుతున్నావ్ ఏమి ? అన్నాడు. ఆయనను చూడగానే త్వష్టకు  మనసు శాంతించింది తన గురువే రూపంలో. దర్శనమిచ్చినట్లు అనిపించింది. ఆయనకు నమస్కరించి, “స్వామి!  అరణ్యంలో మిమ్మల్ని చూడగానే సాక్షాత్తు ఈశ్వరుడని నాకు తోచింది, తను సాధించవలసిన కష్టతరమైన పనులు గురించి విన్నవించుకున్నాడు. అవధూత నాయనా! అభీష్ట ప్రదుడైన విశ్వేశ్వరుడు కాశీలో ఉండగా దుర్లభమేమున్నది? నీవు కాశీ వెళ్లి విశ్వనాధుని పూజించు. కేవలం గుక్కెడు పాలు కోరిన ఉపమన్యుకు ఆయన సాక్షాత్తు పాల సముద్రాన్ని ప్రసాదించిన దయాళువుఅని చెప్పారు. గురు సేవ తప్ప ఏమీ తెలియని త్వష్ట, “స్వామి! కాశీ క్షేత్రం ఎక్కడ ఉన్నది”? అని అడిగాడు. అప్పుడు ముని శ్రేష్ఠుడు, “కాశీకి నిన్ను నేనే స్వయంగా తీసుకుపోతాను. నీవలన నాకు కూడా విశ్వనాథుని దర్శనం అవుతుందిఅని చెప్పి అతనిని మనోవేగంతో కాశీ కి తీసుకు వెళ్ళాడు.

దిగంబరా దిగంబరా  శ్రీపాదవల్లభా దిగంబరా!! 

అధ్యాయం  - 42

శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః

వారిద్దరూ కాశి చేరిన తరువాత త్వష్ట కు అవధూత ఇలా బోధించారు - కాశీ యాత్రలో ముందుగా విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని, అంతర్ గృహ యాత్ర, , కాలభైరవ గృహ, కాశి మణికర్ణిక మొదలగునవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగం ప్రతిష్ట చేసుకో. ఇలా చేస్తే నీ గురుభక్తి దృఢమైన ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది. నీ మనసులో నిస్సందేహంగా గురు చరణాలను స్థిరంగా ఉంచుకో, అని చెప్పి రెప్పపాటులో అవధూత అదృశ్యమయ్యారు. త్వష్ట ఆశ్చర్యచకితుడై, ఆయన సాక్షాత్తు విశ్వేశ్వరుడు సందేహం లేదు, నేను ఆయనను ఆరాధించుకున్నను, ఆయన ప్రసన్నుడు అవడం కేవలం గురు కృప వలనే కదా! లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా ప్రసన్నుడు కానీ ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతాడు? అనుకుని యధావిధిగా కాశీయాత్ర, లింగ ప్రతిష్ట చేసి ధ్యానించగానే  లింగంలో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురువు, గురు భార్య  మొదలైనవారు అడిగినవి విన్నవించాడు. శంకరుడు వరం ఇచ్చి, “నాయనా!, నీ గురు భక్తికి మెచ్చాను, నీవు "విశ్వకర్మ" అనే సృష్టికర్తవు అవుతావు అని దీవించి అదృశ్యమయ్యాడు.

త్వష్ట సంతోషించి గురువు, గురుపత్ని, పిల్లలు కోరినవి సృష్టించి సమర్పించాడు, గురువు సంతోషించి అతనికి జ్ఞానం, సర్వసిద్ధులు, నవ నిధులు, కలిగేలా ఆశీర్వదించారు. కనుక గురుభక్తి వలన సాధ్యం కానిది ఏదీ లేదు. శ్రీ గురుడు గురు భక్తి గురించి చెప్పేసరికి సూర్యోదయం అయింది. సాయందేవుడు శ్రీ గురునికి   నమస్కరించి ఆనంద పారవశ్యంతో, కృపా మూర్తి! నాకు ఇప్పుడు ఒక అపూర్వమైన దర్శనం అయింది. వీరు కథలో కాశి యాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశి క్షేత్రం దర్శించినట్లు అనుభవ మైనది, అది నిధ్రావస్తా లేక స్వప్నమో తెలియడం లేదు. జగద్గురు! మీ నిజ తత్వము తెలియని మూడులకు మీరు మానవులుగా కనిపిస్తున్నారు కానీ మీరు విశ్వేశ్వరులు, మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ  అంటుంటే అతని శరీరం అంతా రోమాంచిత మై, కంఠం గద్దదమై శ్రీ గురుని అవతార మహత్యాన్ని స్తుతించాడు.

శ్రీ గురుడు సంతోషించి, “నాయనా! నీకు కాశీ దర్శనం అయింది కదా! నీ వంశంలో 21 తరాల వారికి కాశీ యాత్రా ఫలం  సిద్ధించింది, నీవు మా దగ్గర ఉండి మా సేవ చేసుకో కానీ, ఆలా చేయాలంటే నీవు మ్లేచ్చ రాజు సేవలో ఉండకూడదు. కనుక నీ భార్య బిడ్డను తీసుకుని వచ్చి గంధర్వ నగరంలో ఉండు అని వెంటబెట్టుకుని గ్రామంలోని తన మఠానికి తిరిగి వచ్చారుసాయం దేవుడు ప్రకారమే స్వగ్రామానికి వెళ్లి భార్యాబిడ్డలు ను తీసుకుని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటి గంధర్వ పురం చేరాడు. శ్రీ గురుడు ఎంతో సంతోషించి అతనిని అతని భార్యా బిడ్డలను తమ సన్నిధిలో కూర్చోబెట్టుకుని వారి క్షేమ సమాచారాలు విచారించారు. సాయందేవుడు  వారి అందరినీ  శ్రీ గురునికి పరిచయం చేశారు.  అతని ఇద్దరు కొడుకులు నమస్కరించి నప్పుడు, అప్పుడు వారి  శిరస్సులపై  చేయి ఉంచి  ఆశీర్వదించాడు , అపుడు శ్రీ గురుడు  సాయం దేవునితో పెద్ద కుమారుడు నాగ నాధుడుని  చూపిస్తూ, ఆయన వీడే నిజమైన భక్తుడు, మాకు ప్రీతిపాత్రుడు. సౌభాగ్యవతి అయిన నీ భార్య పతివ్రత, మీకు ఇంకా నలుగురు కొడుకులు కలుగుతారు. “మ్లేచ్చని సేవించడం వలన నీ పుణ్యం నశిస్తుంది కనుక నీవది విడిచిపెట్టి మా వద్దనే ఉండమని , అతని భార్యా బిడ్డలను కూడా ఒప్పించారు. స్వామి! తర్వాత సాయం దేవునితోమొదట వీరిని తీసుకుని సంగమానికి వెళ్లి స్నానం చేసి అశ్వద్ధాన్ని సేవించుకుని రా అని చెప్పారు."

ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి, కనుక నది ఒడ్డున అందరూ అనంత వ్రతం చేస్తుండగా శ్రీ గురుడు వీరిని కూడా అనంత వ్రతం చేసుకోమని చెప్పారు. అతడుమీరే నాకు అనంతులు మీ పాదసేవే నాకు అనంత వ్రతం, నాకింకా వేరొక వ్రతం ఎందుకు ?”అన్నాడు. స్వామి' నాయనా! నా మాట విని వ్రతం చేసుకో! పూర్వం కౌండిన్యుడు అనే ఋషి  వ్రతం చేసి అభిష్టాలన్నీ పొందారు, అప్పుడు సాయం దేవుడు వ్రత విధానం వివరించమని కోరగా,' శ్రీ గురుడు ఇలా వివరించారు.

దిగంబరా దిగంబరా  శ్రీపాదవల్లభా దిగంబరా!! 

అధ్యాయం  - 43

శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః

  అనంత వ్రతం ఆచరించడం వలన ఎందరికో అభీష్టాలు  సిద్ధించాయి దీనివలన ధర్మరాజు తాను కోల్పోయిన రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు. అనంత వ్రతం,  శుద్ధ చతుర్ధినాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరించాలి. పూర్వం కృతయుగంలో వశిష్ట గోత్రానికి చెందిన: సుమంతుడు అనే మహా ఋషి ఉండేవాడు.

అతనికి సుశీల అనే కూతురు ఉండేది. ఆమె పుట్టిన కొద్ది కాలానికే అతని భార్య దీక్ష దేవి చనిపోయింది. సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉండేది. సుమంతుడు తన కర్మానుష్టానానికి బంగం రాకుండా ఉండేందుకు రెండో వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె గయ్యాలి, పోట్లాడుతూనే ఉంటుంది. కొంతకాలానికి తన కుమార్తెకు వేద శాస్త్ర పారంగతుడైన కౌండిన్యుడికి ఇచ్చి వివాహం చేశారు, కానీ అతని భార్య పెట్టే బాధలు ఓర్వలేక, కౌండిన్యుడు వేరొకచోట ఉండాలనుకున్నాడు. అయినా కూతురు కాపరానికి వెళ్లేటప్పుడు దోవ బత్తా నికి కూడా కించిత్తు వేల పిండి కూడా ఇవ్వడానికి అంగీకరించలేదు. ఆమె చూడకుండా కొంచెం గోధుమపిండి మాత్రం ఆకులో కట్టి ఇచ్చి వారిని సాగనంపారు

మరుసటి రోజు మధ్యాహ్నం ఒక యేటి వద్ద ఆగి  కౌండిన్యుడు స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని, అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీర కట్టుకుని పూజ చేస్తుంటే సుశీలాదేవి ఏమని విచారించగా,  తాము అనంత వ్రతం చేస్తున్నట్లు చెప్పారు.. ఆమె కోరిక మేరకు ఒక ముతైదువ   వ్రత విధానం ఇలా చెప్పింది.

ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు 14 ముడులు వేసిన ఎర్రని తోరం సిద్ధం చేసుకుని , ఎర్రని చీర కట్టుకుని, ఆకులతో ఒక కలశం స్థాపించాలి. తరువాత ద్వాదశాక్షరీ మంత్రంతో గాని, పురుషసూక్త విధానంతో గాని యధాశక్తి పూజించాలి. తరువాత తోరం కుడిచేతికి కట్టుకొని పాత తోరం విసర్జించాలి. తరువాత గోధుమ పిండి వంటలు నివేదించి దక్షిణ తో సహా ఒక వేద విప్రులకు దానం ఇవ్వాలి. ఇలా 14 సంవత్సరములు చేశాక 14 కుండలు దానమిస్తే అన్ని పురుషార్ధాలు సిద్ధిస్తాయి. ఇలా చెప్పి సుశీలాదేవి తో కూడా అనంత వ్రతం చేయించింది. తరువాత ఆమె భర్తతో కలిసి బయలుదేరింది , వ్రత మహిమ అన్నట్లు దంపతులకు ఒక పట్టణంలోని వారు ఎదురొచ్చి, వారిని అక్కడే ఉండమని ప్రార్థించారు. అక్కడ కౌటిల్యుడు శ్రీమంతుడుగా సుఖంగా జీవించాడు.

ఒకరోజు కౌండిన్యుడు తన చేతికున్న తోరం చూసి, “ఇదేమిటి ? నన్ను వశం చేసుకోవడానికి ధరించవా ఏమి? ”అని అడిగాడు. ఇది అనంత తోరం అని,  దాని మహిమ వల్లనే తమకు సిరిసంపదలు వచ్చాయని చెప్పినా నమ్మక దానిని తెంచి నిప్పు లో పడేశాడు. కొద్దికాలానికే వారింట దొంగలు పడి సర్వం దోచుకుపోయారు. అప్పుడు  కౌండిన్యుడు తనతప్పు తెలుసుకుని ఎలాగైనా అనంతుని దర్శించి, ఆయనను శరణ్ పొందనదే భోజనం అయిన చేయనని శబదం చేసి, “అనంతా! అనంతా! అని కేకలు వేస్తూ అడవిలో వెదకసాగాడు, దారిలో ఒకచోట పూత, కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూశాడు. అది ఏమి చిత్రమో గాని ఒక్క పక్షి అయిన వాల లేదు. “అనంతుడు ఎక్కడ? అని అడుగగా, చెట్టు' నాకే ఆయన దర్శనం లభించలేదు' అని చెప్పి నీకు కనిపిస్తే నా దుస్థితి గురించి ఆయనకు నివేదించు అని చెప్పింది. మరొక చోట ఒక గడ్డిపరకనై నా కొరకని ఆవును దూడను చూసి , వాటిని అడిగాడు. అవి కూడా అలానే చెప్పాయి. మరొక చోట అటువంటి ఆంబోతే కనిపించి అలానే చెప్పింది. కొంత దూరం వెళ్ళాక రెండు కొలనులు ఒక దానిలో నీరు మరొక దానిలోకి ప్రవహిస్తున్నది కానీ ఒక్క కొంగ అయినా వాలడం లేదు, తరువాత ఒక గాడిద , ఒక ఏనుగు కనిపించి అవి కూడా అనంతుడు తనకు ఎక్కడా కనిపించలేదు అన్నాయి.

చివరకు అలిసిపోయిన కౌండిన్యుడు ఒక చోట కూలబడ్డాడు. అప్పుడొక ముసలి వాడు అతనిని చేయి పట్టి లేవదీసిఅనంతుని చూపిస్తాను రమ్మనిఒక అందమైన రాజభవనంలో సింహాసనం పైనున్న సుందర విగ్రహాన్ని చూపించారు . కౌండిన్యుడు అతడే అనంతుడని  తలచి అతనికి  నమస్కరించాడు. అప్పుడు అనంతుడు, నాలుగు పురుషార్థాలు, శాశ్వత వైకుంఠ  నివాసం ప్రసాదించారుఅప్పుడు కౌండిన్యుడు అడవిలో చూసిన వింతలు అన్నిటినీ చెప్పాడు. అప్పుడు అనంతుడుపూర్వం ఒక విప్రుడు  విద్వాంసుడైనకూడా వారికి విద్య నేర్వ కుండా, తన కాలమంతా శాస్త్ర వాదాల తోనే  గడిపాడు, అందుకని మరుజన్మలో వ్యర్థమైన మామిడి చెట్టు అయి  అడవి పాలు అయింది. చవిటి నేలను దానం ఇచ్చిన వాడు పశువు అయ్యాడు. శ్రీమంతులై కొంచమైన దానం చేయని వాడు  ఆంబోతు గా జన్మించాడు. ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్క, చెల్లెల్లు నీవు చూసిన రెండు చెరువులు. క్రోధం వహించినవాడు గాడిది గానూ, మదించి విచ్చలవిడిగా ప్రవర్తించిన వాడు ఏనుగు గాను జన్మించారు. నీవు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడు అయ్యావు కనుకే వృద్ధుని రూపంలో నేనే నీకు దర్శనం ఇచ్చాను. తమ దుస్థితి నీతో చెప్పుకొని నాకు తెలుపమని కోరాయి కనుకే వాటన్నిటికీ విముక్తి కలిగింది. “నీవు పునర్వసు నక్షత్ర మై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావుఅని ఆశీర్వదించి పంపారు. అప్పటి నుంచి సుశీలాదేవి కౌండిన్యుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్లారు.

సాయం దేవా! నీవు కూడా నీగోత్ర ఋషి అయినా కౌండిన్యుని వలె వ్రతం ఆచరించు, తరువాత తన భార్యా బిడ్డలను ఇంటి వద్ద ఉంచి  వచ్చి తన జీవిత శేషం అంతా గురు సేవలో గడిపి తరించాడు , అందువల్లే నీకీ నాడు కల్పవృక్షం  వంటిశ్రీ గురు చరిత్రలభించింది. అతడి వంశంలో జన్మించినందుకు నీవెంత ధన్యుడవు.

దిగంబరా దిగంబరా  శ్రీపాదవల్లభా దిగంబరా!! 

మంగళవారం పారాయణ సమాప్తం!

Leave a comment

Filtered HTML

  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <blockquote> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

Plain text

  • No HTML tags allowed.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Lines and paragraphs break automatically.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.