ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః |
సహస్రశీర్షవదనా సహస్రాక్షీ సహస్రపాత్ || 

శ్లోకం వివరణ :

ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళి - తెరువబడుటతోను, మూయబడుటతోను పుట్టిన లీనమైన చతుర్దశ భువనములు కలది.
సహస్రశీర్షవదనా - వెయ్యి లేదా అనంతమైన శిరస్సులతో, ముఖములు కలది.
సహస్రాక్షీ - వెయ్యి లేదా అనంతమైన కన్నులు కలది
సహస్రపాత్ - అనంతమైన పాదములు కలది.

భానుమండలమధ్యస్థా భైరవీ భగమాలినీ |
పద్మాసనా భగవతీ పద్మనాభసహోదరీ || 

శ్లోకం వివరణ :

భానుమండల మధ్యస్థా - సూర్య మండలములో కేంద్రము వద్ద ఉండునది.
భైరవీ - భైరవీ స్వరూపిణి.
భగమాలినీ - వెలుగుతూ గమనము చేయువారిచే హారముగా అగుపించునది.
పద్మాసనా - పద్మమును నెలవుగా కలిగినది.
భగవతీ - భగశబ్ద స్వరూపిణి.
పద్మనాభ సహోదరీ - విష్ణుమూర్తి యొక్క సహోదరి.

సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ |
సదాశివాఽనుగ్రహదా పంచకృత్యపరాయణా ||

శ్లోకం వివరణ :

సంహారిణీ - ప్రళయకాలంలో సమస్త వస్తుజీవజాలాన్ని తనలోనికి ఉపసంహరణ గావించి, లీనము చేసుకొనునది.
రుద్రరూపా - రుద్రుని యొక్క రూపు దాల్చింది.
తిరోధానకరీ - మఱుగు పరచుటను చేయునది.
ఈశ్వరీ - ఈశ్వరుని యొక్క శక్తిరూపములో ఉండునది.
సదాశివా - సదాశివ స్వరూపిణి.
అనుగ్రహదా - అనుగ్రహమును ఇచ్చునది.
పంచకృత్య పరాయణా - సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలనే అయిదు కృత్యముల యందు ఆసక్తి కలది.

సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థావివర్జితా |
సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ ||

శ్లోకం వివరణ :

సుప్తా - నిద్రావస్థను సూచించునది.
ప్రాజ్ఞాత్మికా - ప్రజ్ఞయే స్వరూపముగా గలది.
తుర్యా - తుర్యావస్థను సూచించునది.
సర్వావస్థా వివర్జితా - అన్ని అవస్థలను విడిచి అతీతముగా నుండునది.
సృష్టికర్త్రీ - సృష్టిని చేయునది.
బ్రహ్మరూపా - బ్రాహ్మణ లక్షణము గల రూపము గలది.
గోప్త్రీ - గోపన లక్షణము అనగా సంరక్షణ లక్షణం కలది.
గోవిందరూపిణీ - విష్ణుమూర్తితో రూప సమన్వయము కలది.

ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మాధర్మవివర్జితా |
విశ్వరూపా జాగరిణీ స్వపంతీ తైజసాత్మికా ||

శ్లోకం వివరణ :

ధ్యాన ధ్యాతృ ధ్యేయరూపా - ధ్యానము యొక్క, ధ్యానము చేయువాని యొక్క, ధ్యాన లక్ష్యము యొక్క సమన్వయ రూపము కలది.
ధర్మాధర్మ వివర్జితా - విహితకర్మలు, అవిహిత కర్మలు లేనిది.
విశ్వరూపా - విశ్వము యొక్క రూపమైనది.
జాగరిణీ - జాగ్రదవస్థను సూచించునది.
స్వపంతీ - స్వప్నావస్థను సూచించునది.
తైజసాత్మికా - తేజస్సువంటి సూక్ష్మ స్వప్నావస్థకు అధిష్ఠాత్రి.

పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణీ |
చిన్మయీ పరమానందా విజ్ఞానఘనరూపిణీ ||

శ్లోకం వివరణ :

పంచప్రేతాసనాసీనా - పంచప్రేతలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను ఆసనముగా కలిగి ఆసీనులైనది.
పంచబ్రహ్మస్వరూపిణీ - పంచబ్రహ్మల స్వరూపమైనది.
చిన్మయీ - జ్ఞానముతో నిండినది.
పరమానందా - బ్రహ్మానంద స్వరూపము లేక నిరపేక్షకానంద రూపము.
విజ్ఞానఘనరూపిణీ - విజ్ఞానము, స్థిరత్వము పొందిన రూపము గలది.

చరాచరజగన్నాథా చక్రరాజనికేతనా |
పార్వతీ పద్మనయనా పద్మరాగసమప్రభా || 

శ్లోకం వివరణ :

చరాచర జగన్నాథా - కదిలెడి, కదలని జగత్తుకు అధినాథురాలు.
చక్రరాజ నికేతనా - చక్రములలో గొప్పదైన దానిని నిలయముగా కలిగినది.
పార్వతీ - పర్వతరాజ పుత్రి.
పద్మనయనా - పద్మములవంటి నయనములు కలది.
పద్మరాగ సమప్రభా - పద్మరాగముల కాంతికి సమానమగు శరీరకాంతి కలది.

మనువిద్యా చంద్రవిద్యా చంద్రమండలమధ్యగా |
చారురూపా చారుహాసా చారుచంద్రకళాధరా || 

శ్లోకం వివరణ :

మనువిద్యా - మనువు చేత ఉపాసింపబడిన విద్యారూపిణి.
చంద్రవిద్యా - చంద్రుని చేత ఉపాసింపబడిన విద్యారూపిణి.
చంద్రమండలమధ్యగా - చంద్ర మండలములో మధ్యగా నుండునది.
చారురూపా - మనోహరమైన రూపము కలిగినది.
చారుహాసా - అందమైన మందహాసము కలది.
చారుచంద్రకళాధరా - అందమైన చంద్రుని కళను ధరించునది.

చతుఃషష్ట్యుపచారాఢ్యా చతుఃషష్టికలామయీ |
మహాచతుఃషష్టికోటియోగినీగణసేవితా || 

శ్లోకం వివరణ :

చతుష్షష్ట్యుపచారాఢ్యా - అరువది నాలుగు ఉపచారములతో సేవింపబడునది.
చతుష్షష్టి కళామయీ - అరువది నాలుగు కళలు గలది.
మహాచతుష్షష్టి కోటియోగినీ గణసేవితా - గొప్పదైన అరువది కోట్ల యోగినీ బృందముచే సేవింపబడునది

మహేశ్వరమహాకల్పమహాతాండవసాక్షిణీ |
మహాకామేశమహిషీ మహాత్రిపురసుందరీ ||

శ్లోకం వివరణ :

మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ - సదాశివునిచే మహాప్రళయ సమయమునందు చేయబడు గొప్ప తాండవ నృత్యమును సాక్షి స్వరూపిణి.
మహా కామేశ మహిషీ - మహేశ్వరుని పట్టపురాణి.
మహాత్రిపుర సుందరీ - గొప్పదైన త్రిపురసుందరి.

Pages