క్షేత్రస్వరూపా క్షేత్రేశీ క్షేత్ర క్షేత్రజ్న పాలినీ |
క్షయవృద్ధి వినిర్ముక్తా క్షేత్రపాల సమర్చితా ||

శ్లోకం వివరణ :

క్షేత్రస్వరూపా - క్షేత్ర పదంచే సంకేతింపబడే వాటి స్వరూపంగా నుండునది.
క్షేత్రేశీ - క్షేత్రమునకు అధికారిణి.
క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ - స్థూలభాగమైన దేహమును, సూక్ష్మభాగమైన దేహిని పాలించునది లేదా రక్షించునది.
క్షయవృద్ధివినిర్ముక్తా - తరుగుదల, పెరుగుదల లేనిది.
క్షేత్రపాల సమర్చితా - క్షేత్రపాలకులచే చక్కగా అర్చింపబడునది.

విశ్వాధికా వేద విద్యా వింధ్యాచల నివాసినీ |
విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసినీ ||

శ్లోకం వివరణ :

విశ్వాధికా - ప్రపంచమునకు మించినది అనగా అధికురాలు.
వేదవేద్యా - వేదముల చేత తెలియదగినది.
వింధ్యాచలనివాసినీ - వింధ్యపర్వత ప్రాంతమున నివాసము గలది.
విధాత్రీ - విధానమును చేయునది.
వేదజననీ - వేదములకు తల్లి.
విష్ణుమాయా - విష్ణుమూర్తి యొక్క మాయా స్వరూపిణి.
విలాసినీ - వినోదాత్మక, క్రీడాత్మక లక్షణము గలది.

కళావతీ కళాలాపా కాంతా కాదంబరీ ప్రియా |
వరదా వామనయనా వారుణీ మదవిహ్వలా ||

శ్లోకం వివరణ :

కళావతీ -కళా స్వరూపిణీ.
కలాలాపా - కళలను ఆలాపనా స్వరూపముగా కలిగినది.
కాంతా - కామింపబడినటువంటిది.
కాదంబరీ ప్రియా - పరవశించుటను ఇష్టపడునది.
వరదా - వరములను ఇచ్చునది.
వామనయనా - అందమైన నేత్రములు గలది.
వారుణీమదవిహ్వలా - వరుణ సంబంధమైన పరవశత్వము చెందిన మనోలక్షణము గలది.

కామ్యాకామ కలారూపా కదంబకుసుమప్రియా |
కల్యాణీ జగతీకంధా కరుణారస సాగరా ||

శ్లోకం వివరణ :

కామ్యా - కోరదగినటువంటిది.
కామకళారూపా - కామేశ్వరుని కళయొక్క రూపమైనది.
కదంబకుసుమప్రియా - కడిమి పువ్వులయందు ప్రేమ కలిగినది.
కళ్యాణీ - శుభ లక్షణములు కలది.
జగతీకందా - జగత్తుకు మూలమైనటువంటిది.
కరుణా రససాగరా - దయాలక్షణానికి సముద్రము వంటిది.

రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా |
రక్షాకరీ రాక్షసఘ్నీ రామా రమణ లంపటా ||

శ్లోకం వివరణ :

రమా - లక్ష్మీదేవి.
రాకేందువదనా - పూర్ణిమ చంద్రుని పోలిన ముఖము గలది.
రతిరూపా - ఆసక్తి రూపమైనది.
రతిప్రియా - ఆసక్తి యందు ప్రీతి కలది.
రక్షాకరీ - రక్షించునది.
రాక్షసఘ్నీ - రాక్షసులను సంహరించునది.
రామా - ఎప్పుడూ సంతోషంగా, క్రీడాత్మకంగా వుండేది.
రమణ లంపటా - రమణునితో అత్యంత సాన్నిహిత్య, సామ్య సంబంధము గలది.

రాజారాజార్చితా రాజ్నీ రమ్యా రాజీవలోచనా |
రంజనీ రమణీ రస్యా రణకింకిణిమేఖలా ||

శ్లోకం వివరణ :

రాజరాజార్చితా - రాజులకు రాజులైన వారిచేత అర్చింపబడునది.
రాజ్ఞఈ - రాణి.
రమ్యా - మనోహరమైనది.
రాజీవలోచనా - పద్మములవంటి కన్నులు కలది.
రంజనీ - రంజింప చేయునది లేదా రంజనము చేయునది.
రమణీ - రమింపచేయునది.
రస్యా - రస స్వరూపిణి.
రణత్కింకిణి మేఖలా - మ్రోగుచుండు చిరుగజ్జెలతో కూడిన మొలనూలు లేదా వడ్డాణము గలది.

నారాయణీ నాదరూపా నామరూపవివర్జితా |
హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయవర్జితా || 

శ్లోకం వివరణ :

నారాయణీ - నారాయణత్వ లక్షణము గలది.
నాదరూపా - నాదము యొక్క రూపము అయినది.
నామరూపవివర్జితా - పేరు, ఆకారము లేనిది
హ్రీంకారీ - హ్రీంకార స్వరూపిణి.
హ్రీమతీ - లజ్జాసూచిత బీజాక్షర రూపిణి.
హృద్యా - హృదయమునకు ఆనందము అయినది.
హేయోపాదేయవర్జితా - విడువదగినది, గ్రహింపదగినది, లేనిది.

పురుషార్థప్రదా పూర్ణా భోగినీ భువనేశ్వరీ |
అంబికాఽనాదినిధనా హరిబ్రహ్మేంద్రసేవితా ||

శ్లోకం వివరణ :

పురుషార్థప్రదా - పురుషునకు కావలసిన ప్రయోజనములను చక్కగా ఇచ్చునది.
పూర్ణా - పూర్ణురాలు.
భోగినీ - భోగములను అనుభవించునది లేదా భోగములను ఇచ్చునది.
భువనేశ్వరీ - చతుర్దశ భువనములకు అధినాథురాలు.
అంబికా - తల్లి.
అనాదినిధనా - ఆది, అంతము లేనిది.
హరిబ్రహ్మేంద్ర సేవితా - విష్ణువు చేత, బ్రహ్మ చేత, ఇంద్రుని చేత సేవింపబడునది.

శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జధూళికా |
సకలాగమసందోహశుక్తిసంపుటమౌక్తికా || 

శ్లోకం వివరణ :

శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జధూళికా - వేదములనెడు స్త్రీలయొక్క పాపిటలను, సిందూరము ధరించునట్లు చేసిఅన్ పాదపద్మము యొక్క ధూళిని కలిగినది.
సకలాగమ సందోహశుక్తి సంపుటమౌక్తికా - అన్ని ఆగమ శాస్త్రములనెడు ముత్యపు చిప్పలచే చక్కగా ఉంచబడిన లేదా నిక్షిప్తము చేయబడిన ముత్యము.

ఆబ్రహ్మకీటజననీ వర్ణాశ్రమవిధాయినీ |
నిజాజ్ఞారూపనిగమా పుణ్యాపుణ్యఫలప్రదా ||

శ్లోకం వివరణ :

బ్రహ్మకీటజననీ - బ్రహ్మ నుండి కీటకముల వరకు అందరికీ తల్లి.
వర్ణాశ్రమ విధాయినీ - వర్ణములను, ఆశ్రమములను ఏర్పాటు చేయునది.
నిజాజ్ఞారూపనిగమా - తనయొక్క ఆదేశములే రూపుగట్టుకొనిన వేదములు అయినది.
పుణ్యాపుణ్యఫలప్రదా - మంచిపనులకు, చెడ్డపనులను వాటి వాటికి తగిన ఫలములను చక్కగా ఇచ్చునది.

Pages